Wednesday, May 18, 2016

సేవే వూపిరి.. .ఆశయమే ఆవాసం : వివేకానంద ఆవాస విద్యాలయం

న్యూస్‌టుడే, రామాయంపేట

 ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులే మిన్న. 

- మదర్‌థెరిస్సా ఎదుటి వారి కష్టాలను చూసి బాధపడటం కాదు.. వారికి చేయూత అందించాలి.. 

అన్నదానం కంటే విద్యాదానం గొప్పది.. 

ఇలా మహాత్ముల ఆశలు, ఆశయాలను వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకొని ఓ ప్రభుత్వ ఉద్యోగికి స్ఫురించిన ఆలోచనే నేడు ఎన్నో కుటుంబాల్లో వెలుగు నింపుతుంది. తనతో పాటు మరికొంతమందిని కలుపుకుని దాతల సాయంతో నాణ్యమైన భోజనం, వసతి సౌకర్యాలతో పాటు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ, నీతినిజాయతీ, దేశభక్తి గల పౌరులను అందించడానికి మలివయసులోను(70) అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.

ఆయనే రామాయంపేట పట్టణంలోని వివేకానంద ఆవాస విద్యాలయం వ్యవస్థాపకులు కృష్ణారెడ్డి. రామాయంపేట పట్టణంలోని మెదక్‌ రోడ్డుపై సువిశాలమైన మూడున్నర ఎకరాల్లో కొనసాగుతున్న ఆవాస విద్యాలయం ఏర్పాటుకు కృష్ణారెడ్డి కృషి ఎనలేనిది. అయితే రామాయంపేట మండలంలో విద్యుత్తు శాఖలో ఏఈగా పని చేసిన కృష్ణారెడ్డి 1981లో గ్రామాల్లో క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లిన సమయంలో చదువు లేక పేదరికంతో బాధపడుతున్న వారిని చూసి చలించిపోయారు. బతుకులు బాగుపడాలంటే చదువే అసలైన మార్గమని ఎంచుకున్న ఆయన వారి కుటుంబాలో వచ్చే తరానికి విద్యతో వెలుగు నింపాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా వ్యవసాయ బావులకు విద్యుత్తు ఏర్పాటు కోసం వచ్చే రైతులతో మాట్లాడి విరాళాల సేకరణకు ఉపక్రమించారు. 

ఆయన సేవాతత్పరతను గమనించిన సామాన్య రైతులు సైతం తమకు తోచిన సాయం అందించడానికి ముందుకొచ్చారు. దీంతో 280 మంది విద్యార్థులతో సరస్వతి శిశుమందిర్‌ను ప్రారంభించారు. నాడు ఉద్యోగిగా.. నేడు విశ్రాంత ఉద్యోగిగా నిరుపేద విద్యార్థులకు చేయూత అందిస్తూనే ఉన్నారు. 

ఆవాసంగా రూపాంతరం.. 

కాలగమనంలో ఆంగ్లంపై మోజు పెరుగుతున్న తరుణంలో ప్రైవేటు పాఠశాలలు రంగ ప్రవేశం చేశాయి. ఆకర్షణీయ ప్రకటనలతో దూసుకువస్తున్న వాటివైపు తల్లిదండ్రులు ఆకర్షితులయ్యారు. దాంతో శిశుమందిర్‌లో క్రమక్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పాఠశాలను మూసివేశారు. కానీ ఆయన ఆయన నిరుత్సాహపడకుండా తన లక్ష్యాన్ని చేరుకునేందుకు మరోవిధంగానైనా పేదలకు సేవలు అందించాలనే తపనతో కృషి చేశారు. 

సేవాభారతి అనుబంధంగా అనేక మంది దాతల సహకారంతో 2006 అక్టోబరులో భోజనం, వసతి ఏర్పాటుతో 25 మంది విద్యార్థులతో వివేకానంద ఆవాస విద్యాలయంగా పునరుద్ధరించారు. ప్రైవేటు పాఠశాలల సహకారం.. ప్రతిభ ఉన్న నిరుపేద విద్యార్థులకు సహాయ, సహాకారాలు అందిస్తూ ప్రోత్సహించాలన్న తపనతో కృష్ణారెడ్డి చేస్తున్న కృషికి ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు సైతం తమవంతు సహకారం అందించేందుకు ముందుకొచ్చాయి. దీంతో ఆవాసంలోని నిరుపేద విద్యార్థులకు 50 శాతం ఫీజు మాఫీకి అంగీకరించాయి. మిగిలింది ఆవాసం ద్వారా చెల్లిస్తున్నారు. విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్నా.. ఆవాస విద్యాలయంలో వసతి, భోజన సౌకర్యాన్ని కల్పించారు. వీటితో పాటు ఒక ఉపాధ్యాయుడిని (ఆవాస ప్రముఖ్‌) ఏర్పాటు చేసి ఉదయం, సాయంత్రం విద్యార్థులకు పాఠ్యాంశాలను ఇతర సంస్కారాలను బోధిస్తున్నారు. 

సంస్కృతి, సంప్రదాయాలు విద్యతో పాటు విద్యార్థులను ప్రోత్సహించడానికి, వారిలో ఉన్న ప్రతిభను వెలికితీయడానికి వివిధ రకాల అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. నృత్యాలు, సంస్కృతి, సంప్రదాయాలలో తర్ఫీదు ఇస్తున్నారు. ఉదయం సూర్యనమస్కారాలు, సాయంత్రం సంధ్యా వందనంతో పాటు యోగా, స్వయంరక్షణ కోసం కరాటే, కుంగ్‌ఫూ, కర్రసాము, ఏకాగ్రత కోసం ధ్యానం వంటివి నిత్యం సాధన చేయిస్తున్నారు. దేశభక్తిని పెంపొందించేందుకు మహాత్ముల జీవిత చరిత్ర పుస్తకాలను వారి చేత చదివిస్తుండటం గమనార్హం. 

నిర్వాహకుల సంకల్పానికి అనుగుణంగా ఇందులో నివాసం ఉంటున్న విద్యార్థులు క్రమశిక్షణకు ప్రతిరూపాలుగా నిలుస్తూ ఆకట్టుకుంటున్నారు. ప్రముఖ్‌ ఎల్లవేళలా వారితోనే ఉంటూ మంచి చెడులను చూస్తున్నారు. 60 మంది విద్యార్థులకు ఆశ్రయం.. మహాయజ్ఞంలా చేపట్టిన ఆవాస విద్యాలయంలోని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కృష్ణారెడ్డి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. అయితే ఆవాస విద్యాలయ కార్యకలాపాలు, సేవా కార్యక్రమాలు కొనసాగించేందుకు 29 మంది సేవాతత్పరతను కలిగిన సంఘ సేవకులతో 2009లో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వ్యాపారులు, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో పాటు ఇతర జిల్లాలకు చెందిన దాతల నుంచే అందే సహకారంతో నిరుపేద విద్యార్థులకు ఆశ్రయం కల్పిస్తున్నారు.

 ప్రస్తుతం 60 మంది నిరుపేద విద్యార్థులు ఆవాసంలో ఆశ్రయం పొందుతున్నారు. కమిటీ సభ్యులు సైతం వారి సంక్షేమం తమ బాధ్యతగా భావించి రోజూ ఆవాసాన్ని సందర్శిస్తారు. అవసరం మేర వసతులు కల్పిస్తారు. వీరి ఆధ్వర్యంలో ఏటా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న విజ్ఞాన కేంద్రాలకు విద్యార్థులను విజ్ఞానయాత్రకు తీసుకెళ్తుండటం విశేషం. విజ్ఞానం కోసం అన్ని అంశాల్లో విజ్ఞానం పొందాలనే ఉద్దేశంతో మహాత్ములు, దేశభక్తి, స్వాత్రంత్య్ర సమరయోధులు, మన దేశ సంప్రదాయాల పుస్తకాలతో కూడిన ఓ కొత్త భవనాన్ని నిర్మించారు. ఇందులో సుమారు 500 పుస్తకాలు ఉన్నాయి. 

అంతేకాక సాంకేతిక సృజనకు కంప్యూటర్‌ విద్య సైతం అందిస్తున్నారు. వీటితోపాటు ఆవాస విద్యాలయం ఆధ్వర్యంలో గ్రామాల్లో 17 బాల సంస్కార కేంద్రాలు, 15 సంచీ గ్రంథాలయాలు, 3 కిశోరీ వికాస కేంద్రాలు నిర్వహిస్తున్నారు. అలాగే గోమాత రక్షణే ధ్యేయంగా వేదమాత గోసంరక్షణ సమితి పేరుతో ఇప్పటికే 44 ఆవులను రైతులకు అందించారు. అన్ని అంశాలను..: కృష్ణారెడ్డి, ఆవాస విద్యాలయం వ్యవస్థాపకులు ప్రతిభ ఉన్నా చదువుకోలేని నిరుపేద విద్యార్థులు గ్రామీణ ప్రాంతంలో ఎంతో మంది ఉన్నారు. వారికి చదువుకునే వాతావరణం ఉండక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి అన్ని సౌకర్యాలతో కూడిన విద్య అందించాలనే ఉద్దేశంతో ఆవాస విద్యాలయాన్ని నెలకొల్పాం. అన్ని అంశాల్లో వారికి శిక్షణ ఇస్తున్నాం. వారి కాళ్ల మీదే వాళ్లే నిలబడేలా తర్ఫీదు ఇస్తున్నాం. ప్రస్తుతం కంప్యూటర్‌ విద్య సైతం ప్రవేశపెట్టాం. 

Source: EENADU

No comments:

Post a Comment